హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ను సవరించాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పదో షెడ్యూల్లోని లొసుగులను అడ్డంపెట్టుకుని ప్రజా ప్రతినిధులు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో పార్టీ ఫిరాయింపులపై మీడియాతో మాట్లాడారు.
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. పదో షెడ్యూల్ లోని చర్యలపై నిర్ణీత గడువు విధించకపోవడంతో స్పీకర్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ చాలా సమయం తీసుకున్నారని, ఈ అంశంపై దాదాపు రెండున్నరేండ్లు వృథా అయిందన్నారు. పదో షెడ్యూల్లో నిర్ణీత గడువు ఉండి ఉంటే ఇంత సమయం పట్టేది కాదన్నారు.
